సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14 2026, సత్తెనపల్లి మండల రిపోర్టర్: సిహెచ్ విజయ్ గవర్నర్ ప్రసంగం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాకుండా ప్రభుత్వ బాధ్యతకు ప్రతిరూపమని, కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలో గత అనుభవాలు, నేటి విజయాలు, భవిష్యత్తు ప్రణాళికలను సమగ్రంగా ప్రతిబింబించారని, గత పాలకుల విధానాల వల్ల ఏర్పడిన దుష్పరిణామాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని ఎంతకాలం ప్రభావితం చేస్తుందో, అలానే గత విధ్వంసం కూడా రాష్ట్రాన్ని ప్రభావితం చేసిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. అయితే నేడు ఆ విధ్వంసాన్ని అధిగమిస్తూ కుప్పకూలిపోయిన వ్యవస్థలను పునర్నిర్మాణం చేస్తూ రాష్ట్రం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాల్లో సంక్షేమం తో పాటు అభివృద్ధిని సమన్వయంగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం శాఖల వారీగా సంస్కరణలు చేపడుతోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి వివరించారు. ఆర్థిక, విద్య, ఐటి, వైద్య, వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, పంచాయితీరాజ్, హోం శాఖలలో అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ పాలన శైలి మహా సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయల పాలనను స్మరింపజేస్తోందని, రాష్ట్ర భవిష్యత్తును రూపకల్పన చేసే దిశగా డేటా సెంటర్, ఏఐ సిటీ, డ్రోన్ సిటీ, స్టార్ట్అప్ వ్యాలీ వంటి ప్రణాళికలు అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఇవి అమరావతి క్యాపిటల్ రీజియన్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా చేస్తాయని, రాష్ట్రాన్ని దూరదృష్టితో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఆలోచనలకు రెట్టింపు శక్తిని అందిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విశాఖ ఉత్సవ్, యోగాంధ్రా 2025, సారస్ మేళా వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, యువతలో రాజకీయాల పట్ల మరియు పరిపాలన పట్ల గౌరవాన్ని పెంపొందిస్తున్నాయని, ఇలాంటి నిర్మాణాత్మక ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం తనకు గర్వకారణమని పేర్కొంటూ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడానికి అవకాశం కల్పించిన సభాపతికి కృతజ్ఞతలు తెలిపారు.