ఏసీబీ వలకు చిక్కిన గంగవరం ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు.

సాక్షి డిజిటల్ న్యూస్: ప్రతినిధి: కే ప్రకాశ రావు రంపచోడవరం, పోలవరం జిల్లా: గంగవరం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ దాడి – ఎస్సై, కానిస్టేబుల్ అరెస్ట్ పోలవరం జిల్లా, గంగవరం, గురువారం రాత్రి: జిల్లాలో అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గంగవరం పోలీస్ స్టేషన్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.15,000 లంచం స్వీకరిస్తుండగా ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు లను రంగే చేత పట్టుకుని అరెస్ట్ చేశారు. నెల్లిపూడి గ్రామానికి చెందిన ఒక కుటుంబ వివాదంలో అనుకూలంగా వ్యవహరించాలంటే డబ్బులు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి, ముందుగా గుర్తింపు చేసిన కరెన్సీ నోట్లతో పన్నాగం పన్ని గురువారం రాత్రి దాడి నిర్వహించారు. లంచం తీసుకున్న వెంటనే అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో స్టేషన్ పరిసరాల్లో కొంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, ఏసీబీ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్వాధీనం చేసుకున్న డబ్బులను సీజ్ చేసి, అధికారిక ప్రక్రియలు పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ ధృవీకరిస్తూ, ఇద్దరు అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే లంచం తీసుకోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అవినీతి పై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.