సర్పంచ్ గ్రామస్తులతో కలిసి ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా

★నాలుగు రోజుల నుండి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు★తక్షణమే నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ సువర్ణ అశ్వర్థ రెడ్డి డిమాండ్

జనం గోరంట్ల మండలం : మల సముద్రం గ్రామంలో నాలుగు రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సర్పంచ్ సువర్ణ అశ్వర్థ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్రామానికి రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని, తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని సర్పంచ్ సువర్ణ అశ్వర్థ రెడ్డి డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా మంచినీరు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆమె తెలిపారు. ధర్నాలో పాల్గొన్న గ్రామస్తులు మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిధులు మంజూరు చేసి గ్రామానికి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని వారు కోరారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేసిన మలసముద్రం పంచాయతీకి నిధులు ఇవ్వకుండా ఇక్కడ అధికారులు అడ్డుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు వెంటనే నిధులను వెంటనే మంజూరు చేయాలని అలాగే నీళ్ల సమస్య పరిష్కారం చేయాలని లేనిపక్షంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తామని వారు తెలిపారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ఆఫీసులో సిబ్బంది తక్కువగా ఉన్నందువలన ఈ సమస్య తలెత్తిందని పది రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని సర్పంచ్ కి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు .ధర్నా శాంతియుతంగా కొనసాగింది.