లోక కల్యాణం కోరుతూ.. శివయ్య చెంత షాద్ నగర్ ఎమ్మెల్యే!

*రామేశ్వరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: సతీసమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్న వీర్లపల్లి శంకర్ దంపతులు

సాక్షి డిజిటల్ న్యూస్, 13 ఫిబ్రవరి, ​షాద్ నగర్/రిపోర్టర్/కృష్ణ “ఈ లోకాన్ని చల్లగా చూడు శివయ్య..” అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ముక్కంటిని వేడుకున్నారు. తెలంగాణలోనే అత్యంత మహిమాన్వితమైన స్వయంభూ లింగంగా వెలుగొందుతున్న ఫరూక్ నగర్ మండలం రామేశ్వరంలోని శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి వారిని బుధవారం ఆయన దర్శించుకున్నారు.
​రామేశ్వరంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే తన సతీమణి అనురాధతో కలిసి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవంలో దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. ​ప్రభుత్వ పాలనపై శివయ్య ఆశీస్సులు ఉండాలి: ఎమ్మెల్యే
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. భక్తుల కోర్కెలు తీర్చే భోళాశంకరుడి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆకాంక్షించారు. శివయ్య కరుణాకటాక్షాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తుందని, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని తెలిపారు. అంతకుముందు ఆలయ కార్యనిర్వహణ అధికారి శివకుమార్ ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ​భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *