సాక్షి డిజిటల్ న్యూస్: ప్రతినిధి. రంపచోడవరం, ఫిబ్రవరి 12: పోలవరం జిల్లాలో భూగర్భ జలాలు వృథా కాకుండా వాటిని వ్యవసాయానికి సమర్థంగా వినియోగించేలా తగు చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు. గురువారం రంపచోడవరం మండలం రంప గ్రామంలోని దొర వీధిలో ఉన్న చలమలను (స్ప్రింగ్ షెడ్) ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పూర్వం గ్రామాల్లో కాలువల ద్వారా వచ్చే చలమ నీటిని ప్రజలు త్రాగునీటిగా ఉపయోగించేవారని తెలిపారు. చలమలను దైవంగా భావించి దీపారాధనలు, పూజలు నిర్వహించి ఆ నీటిని సేవించేవారని పేర్కొన్నారు. పూర్వం నుంచి ప్రవహిస్తున్న చలమల నీటి పరిమాణం ప్రస్తుతం తగ్గిందా లేదా అన్న అంశంపై ఆరా తీశారు. ఈ తరం యువతకు చలమల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద స్ప్రింగ్ షెడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. భూగర్భ జలాలు వృథా కాకుండా వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులు పూర్వం నుంచి చలమల నీటినే త్రాగునీటిగా వినియోగించేవారని, ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గిరిజనులపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపిడీ టి. శ్రీనివాస్ విశ్వనాథ్, ఎంపీపీ శ్రీమతి బంధం శ్రీదేవి, ఎంపీడీవో ప్రసాద్, ఏపీవోలు బి. సత్యనారాయణ, శ్రీనివాస్, సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ వీరన్న, జేఈలు, ఏఈలు, పీసా కమిటీ సభ్యులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎఫ్ఏలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.