జనం న్యూస్ 12ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. లింగాపూర్: కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం జాముల్ ధార గ్రామపంచాయతీ పరిధిలోని మోతిగూడ, నాయక్‌పోడ్ గూడ గ్రామాల్లో బోరింగ్ మోటర్ పనుల వివాదంపై జిల్లా కలెక్టర్ కె. హరిత గురువారం గ్రామాన్ని సందర్శించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క చొరవతో కలెక్టర్ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో నేరుగా సమావేశమయ్యారు. అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గ్రామస్తుల సమస్యలను వివరంగా విన్నారు. తాగునీటి సమస్య తీవ్రతను గుర్తించి చట్టపరమైన పరిమితుల్లో శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అటవీ కోర్ ఏరియా నిబంధనలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. గ్రామస్తుల ప్రాథమిక అవసరమైన తాగునీటి సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, ఆదివాసీల హక్కులు కాపాడుతూ అభివృద్ధి పనులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో రోడ్లు, ఇంద్రమ్మ ఇళ్లు, విద్యుత్ తదితర సమస్యలపై కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అర్ధరాత్రి జరిగిన ఉద్రిక్తత తర్వాత సుగుణక్క జోక్యంతో పరిస్థితి సర్దుమణిగిన విషయం తెలిసిందే. ఆమె చొరవతోనే కలెక్టర్ స్వయంగా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్