కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై భారీ నిరసన 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించకపోతే కేంద్రానికి పుట్టగతులు ఉండవు: ఏ.రామానాయుడు హెచ్చరిక

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 చిత్తూరు పట్టణం (రిపోర్టర్ జయచంద్ర): కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ఉద్యోగి, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు చిత్తూరు జిల్లా కేంద్రంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మునిస్వామి నాయుడు పార్కు నుండి ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్సార్‌టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నాయకులు దాసరి చంద్ర, కాంజీవరం సురేంద్ర, సీఐటీయూ నాయకులు ప్రసాద్ తదితరులు నాయకత్వం వహించారు. అనంతరం జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రామానాయుడు మాట్లాడుతూ కార్మిక వర్గం ఆరు దశాబ్దాల క్రితం ప్రాణత్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించకుండా నాలుగు లేబర్ కోడ్ల ద్వారా హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగారాజు, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు చాంద్‌బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని పెద్ద కార్పొరేట్ శక్తులకు మద్దతుగా పనిచేస్తోందని ఆరోపించారు. ఆదాని, అంబానీలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు బానిసత్వాన్ని మిగిల్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.30 వేలుగా నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. రాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్‌ల వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతోందని, వాటిపై నియంత్రణలు విధించాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు మంజూరు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని, ఆటో డ్రైవర్లు, హమాలీల కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఈపీఎఫ్ పెన్షన్‌ను రూ.9 వేలుగా పెంచాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కార్మిక, రైతు, ఉద్యోగి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, మణి, రమాదేవి, విజయగౌరి, కుమారి, బ్యాంకు శేఖర్, అంగన్వాడీ ప్రేమ, షకీలా, ప్రభావతి, ఆశా గంగాభవాని, ఆటో విజయ్‌కుమార్, రఘు, రవి, మునిసిపల్ జయశంకర్, సుగుణ, వాసు, సుకన్య, రమణి, సురేష్, సివిల్ సప్లై కృష్ణ, ఐఎంఎఫ్‌ఎల్ చంద్ర, మెడికల్ మణికంఠ, రాజారాం, మిడ్‌డే జయలక్ష్మి, జనరల్ హమాలి కమల్, నాగరాజా, బిల్డింగ్ వర్క్స్ మునుస్వామి, జయరాం తదితరులు పాల్గొన్నారు.