జనం న్యూస్ ఫిబ్రవరి 12 రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు కొత్తపేట చౌరస్తాలో నిరసన కార్యక్రమం ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా మున్సిపల్ సంఘం అధ్యక్షులు రమావత్ సక్రు నాయక్ ఆధ్వర్యంలోచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నరసింహ హాజరై అనంతరం మాట్లాడుతూ మండలంలో సరూర్నగర్ హస్తినాపురం కర్మన్ఘాట్ ఎన్టీఆర్ నగర్ ఎల్బీనగర్ సర్కిల్లో మండలంలో భారీ ఎత్తున కార్మికుల నిరసన తెలియజేయడం జరిగింది, విద్యుత్ సవరణ చట్టం- 2025, విబి జి-రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్బసిలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించాలని, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని నిరాయుధులను చేసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు బంగారు పళ్ళెంలో పెట్టి బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైందని అందులో భాగంగానే వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను 6 సం॥ల క్రితం (2019, 2020 సం॥లలో) తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడిన ఫలితంగా ఇంతకాలం వాటిని అమలు చేయకుండా ఆపగలిగాము. కానీ నేడు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ సంస్థల సులభతర వ్యాపారానికి ద్వారాలు తెరిచి , కార్పొరేట్ల ప్రయోజనాలు, వారి లాభాలు పెంచేందుకే 2025 నవంబర్ 21న లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే సమయంలో హడావుడిగా మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబి జి-రామ్ జీ స్కీమ్ను తెచ్చి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపి, విద్యుత్ సవరణ బిల్లు-2025, విత్తన సవరణ చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి లాంటి మరిన్ని వినాశకరమైన చట్టాలను, బిల్లులను తీసుకొచ్చి శ్రమజీవులపై దాడి చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చిస్తారంగా ఉన్న శ్రామిక వర్గాలను చావు దెబ్బ కొట్టింది.కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల అమలుతో 40 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలు చితికిపొయ్యేలా, కార్పొరేట్లు లాభాలు ప్రోగేసుకోడానికి మార్గం సుగమం చేసింది. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలను నియంతృత్వ, దౌర్జన్య పూరితంగా కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని మార్చి వేసింది. ఇది రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే రాజ్యాంగ వ్యతిరేక చర్య. అంతర్జాతీయ కార్మిక సంస్థ “ఐఎల్డీ” సిఫారసులను పూచిక పుల్లలా తీసి పారేశారు. బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం- 1926 ప్రకారం యూనియన్ల ఏర్పాటు కార్మికుల హక్కుగా పొందారు. కానీ ఈ లేబర్ కోడ్లతో కార్మికులు సంఘం పెట్టే హక్కు, సంఘటిత మయ్యే హక్కు నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కుపాదం మోపారు. ఈ విధానం వల్ల పెట్టుబడి దారులకు అనేక రెట్లు లాభాలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. కార్మికుల రిట్రెంజ్మెంట్, లేఆఫ్ కు 100 మంది కార్మికులు పనిచేసే పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఎత్తివేసి 300లకు పెంచారు. లేబర్ అధికారుల కోరలు పీకి ఫెసిలిటేటర్గా మార్చి వారిని మధ్యవర్తులుగా రాయబారాలు చేసే అనామకులుగా నిర్ణయించి లేబర్ కోర్టులను రద్దు చేసి వాటి స్థానంలో పారిశ్రామిక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. ఆ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు అమలు కాకుండా ఉండేందుకు. అపరిమితమైన అధికారాలు ఆయా ప్రభుత్వాలకు కట్టబెట్టారు.కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత నుండి యాజమాన్యాలు చట్టబద్ధంగా తప్పించుకునేందుకు పలు మార్గాలను సృష్టించారు. కనీస వేతనాలకు బదులుగా ఫ్లోర్ లెవల్ కనీస వేతనం అనులు చేయనున్నట్లు లేబర్ కోడ్లలో పేర్కొన్నారు. కనీస వేతనాల నిర్ణయానికి ఇప్పటివరకు ఉన్న డా॥ అల్ట్రాయిడ్ సిఫారసులు, 1957 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు, 1992 నాటి రాష్ట్రాకోస్ బ్రైట్ రేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకు తిలోదకాలిచ్చారు. ఈ కోచ్లో కనీస వేతన నిర్వచనమే లేదు. వేతనాలు ఎలా నిర్ణయిస్తారో చెప్పలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేషనల్ ఫ్లోర్ లెవల్ వేతనం రోజుకు రూ.178/-లు, నెల వేతనం రూ.4,628/- లకు తక్కువ కాకుండా ఏ రాష్ట్రంలో ఇవ్వకూడదంటున్నారు. ఇదే అమలైతే ప్రస్తుతం కార్మికులు అదనంగా పొందే వేతనాల్లో భారీ కోతలు తప్పవు, కార్మికులు జీవించడమే గగనంగా మారనున్నది.ఎన్ని పని గంటలు ఉండాలో, ఎప్పుడు విరామం ఉండాలో, ఎంత స్ప్రెడ్ ఓవర్ టైమ్ ఉండాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. మేడే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినం యొక్క పోరాట స్ఫూర్తిని నేటి కార్మికవర్గానికి తెలియకుండా చేసే ప్రయత్నాలకు పూనుకున్నారు. మన రాష్ట్రంతో పాటు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పని దినాన్ని 10 గంటలకు, స్ప్రెడ్ ఓవర్ టైమ్ను 12 గంటలకు పెంచుతూ చట్ట సవరణలు చేశారు. ఈ లేబర్ కోడు ఈఎస్ఐఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ మరియు ప్రసూతి ప్రయోజనాల వంటి అన్ని ప్రయోజనాలను మింగేస్తాయి. ఇవి అమలైతే అధిక శాతం కార్మికులకు చట్టపరంగా సామాజిక భద్రతా పరిధి నుండి గెంటివేయబడతారు. లేబర్ కోడ్ వల్ల అసంఘటితరంగ కార్మికులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని మోడీ ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేస్తోంది. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు పని భద్రత, పిఎఫ్, ఈఎస్బ, వెల్ఫేర్ బోర్డులో పేర్కొన్న పథకాలు ఎలా లభిస్తాయనే అంశంలో లేబర్ కోడ్స్లో నిర్దిష్టమైన ప్రస్తావన లేదు. అలాగే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెపి విఓఏ, ఆర్పి, ఉపాధి హామీ, నేషనల్ హెల్త్ మిషన్ లాంటి స్కీములలో పనిచేస్తున్న వారిని కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు. కార్పొరేట్ యజమానులు కార్మికుల శ్రమను, దేశ సంపదను యధేచ్ఛగా దోచుకునేందుకు, బానిసత్వంలోకి నెట్టేందుకే ఈ 4 లేబర్ కోట్లు దోహదం చేస్తాయి. కావున దేశవ్యాప్తంగా ఈ సమ్మెతోనే ప్రభుత్వం కళ్ళు తెరవాలని పేదలను, కార్మికులను, ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలలో చిన్న చిన్న ఉద్యోగాలలో కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న కార్మికులకు ఆదుకునే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గ్యార క్రాంతి కుమార్, కమలమ్మ, ఇస్మాయిల్, శ్యామల, రమణమ్మ ఉష సర్నాడు మండల కార్యదర్శి వినోద్ తదితరులు పాల్గొన్నారు.