సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి:13 కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్ ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి అందులోకి చొరబడి 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులతో పాటు స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి బృందావన్ కాలనీలో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీరేఖ బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి తన తల్లి నివాసముండే దేవునిపల్లికి వెళ్ళింది. గురువారం ఉదయం శ్రీరేఖ ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. అలాగే బీరువాను పగులగొట్టి అందులో ఉన్న 16 తులాల బంగారం, 3 తులాల వెండి, 3 వేల రూపాయల నగదును దొంగలు అపహరించుకు వెళ్లారని పోలీసులకు సమాచారం అందజేసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అలాగే ఇంటి చుట్టు ప్రక్కల అమర్చిన సిసి ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.