అడ్డూ అదుపులేని ఇసుక అక్రమార్జన.. అధికారుల అండదండలతోనే ‘మాఫియా’ దందా!

*లక్ష్మీదేవిపల్లి పట్టపగలే యథేచ్ఛగా ఇసుక తరలింపు * అతివేగంతో ట్రాక్టర్ల విన్యాసాలు దుమ్ముతో ప్రజల ఉక్కిరి బిక్కిరి

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న : తొక్కేస్తాం కేసులు చూసుకుంటాం అంటూ అక్రమార్కుల బరితెగింపు ప్రమాదంలో రైల్వే బ్రిడ్జి పునాదులు పట్టించుకోని అధికార యంత్రాంగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో ఇసుక మాఫియా అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమార్కులు పట్టపగలే రోడ్లపై ట్రాక్టర్లతో విన్యాసాలు చేస్తున్నారు. హేమచంద్రాపురం, ఎదురుగడ్డ, కారుకొండ, రామవరం ప్రాంతాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, చెక్ పోస్టులు లేని దారుల గుండా అక్రమంగా ఇసుకను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ప్రాణసంకటంగా మారిన వేగం ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు నడిరోడ్డుపై మృత్యుశకటాల్లా ప్రయాణిస్తున్నాయి. అతివేగంతో వెళ్తున్న ఈ వాహనాల వల్ల కిలోమీటర్ల మేర దుమ్ము మేఘాలు కమ్ముకుంటున్నాయి. రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల కప్పులు మొత్తం దుమ్ముతో నిండిపోవడమే కాకుండా, కనీసం రోడ్డు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. మాకు అధికారుల అండ ఉంది. అడ్డుకుంటే ట్రాక్టర్లతో తొక్కేస్తాం. కేసులు ఏవైనా మేమే చూసుకుంటాం అని మాఫియా సభ్యులు బాహాటంగానే బెదిరింపు లకు దిగుతుండటం గమనార్హం. ప్రమాదంలో రైల్వే వంతెన భద్రాచలం రోడ్డు – మణుగూరు వెళ్లే రైల్వే బ్రిడ్జి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అర్ధరాత్రి వేళ జేసీబీలతో బ్రిడ్జి పునాదుల వద్ద ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తుండటంతో పునాదులు బయటపడుతున్నాయి. పగటిపూట ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఈ ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం చాతకొండ వద్ద ఇసుక తవ్వకాల్లో ఎడ్లబండి ప్రమాదానికి గురై ఒక కూలీ మృతి చెందడంతో అక్కడ ర్యాంపు నిలిచిపోయినప్పటికీ, హేమచంద్రా పురం, ఎదురుగడ్డ, అనిశెట్టిపల్లి, సాటివారిగూడెం ప్రాంతాల్లో దందా నిరాటంకంగా సాగుతోంది. నిమ్మకు నీరెత్తిన అధికారులు మండలంలో ఐదు ఇసుక ర్యాంపులు ఉన్నప్పటికీ, ఎక్కడా సరైన నిఘా లేదు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ లేని వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారులే అక్రమార్కులకు రహదారులను సుగమం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జర మా ప్రాణాలు కాపాడండి మహాప్రభూ అంటూ స్థానికులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, రైల్వే బ్రిడ్జిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *