శ్రమదోపిడీకి ‘కోడ్’ ముసుగు.. కార్మికులను బానిసలుగా మారుస్తున్న కేంద్రం!

★లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య

(సాక్షి డిజిటల్ న్యూస్ బి ప్రభాకర్ బ్యూరో, కాటేదాన్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల రక్తాన్ని కార్పొరేట్లకు ధారపోసేందుకు కుట్ర పన్నుతోందని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య నిప్పులు చెరిగారు. శ్రమ దోపిడీకి చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ చౌరస్తాలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యజమానుల రాజ్యమే లక్ష్యమా? ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ, దశాబ్దాల పోరాట ఫలితంగా కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను తుంగలో తొక్కి, నాలుగు కోడ్లను తీసుకురావడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. "ఈ కోడ్లు అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రత అనేది గాలిలో దీపమే. పని గంటల పరిమితి ఉండదు, జీతాల పెంపు యజమానుల ఇష్టారాజ్యంగా మారుతుంది. ఇది కార్మికులను ఆధునిక బానిసత్వంలోకి నెట్టడమే" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే సామాన్యుల కొనుగోలు శక్తిని ఈ చట్టాలు దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఫిబ్రవరి 12న ‘సమర శంఖం’ జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అవమానిస్తూ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికుల బతుకులను ఛిద్రం చేసే ఈ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ప్రతి కార్మికుడు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న నేతలు: ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నర్రగిరి, వినయ్ యుగంధర్ రెడ్డి, జగన్, సురేష్, జాస్వ, పెంటయ్య, రమేష్, ఆనంద్, బాల్ రాజ్, నరేందర్, నరసింహ, బాబు, సత్యం, మల్లేష్ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.