సాక్షి డిజిటల్ న్యూస్ రంపచోడవరం డివిజన్ ప్రతినిధి. కె.ప్రకాశరావు, ఊర చెరువులో వ్యర్థాల తాండవం – ప్రజల ఆరోగ్యంపై ముప్పు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక సెంటర్ ఊర చెరువులో పరిధిలోని ప్రధాన చెరువు ప్రస్తుతం వ్యర్థాలతో నిండిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో కోడి పేగులు, ఈకలు, ప్లాస్టిక్ కవర్లు వంటి మాంసాహార వ్యర్థాలు అక్రమంగా పడవేయడంతో దుర్వాసన వ్యాపించి పరిసర ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. దీంతో చెరువు నీరు పూర్తిగా మలినమై, దోమలు పెరిగే అవకాశం ఉండటంతో జ్వరాలు, చర్మవ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు పరిసరాల్లో దుకాణాలు నిర్వహించే కొందరు వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యర్థాలను అక్కడే పడేస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్థులు అంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెరువును శుభ్రం చేయడంతో పాటు, వ్యర్థాలు వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
