రాయికల్‌లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఫిబ్రవరి 03 మామిడిపెల్లి లక్ష్మణ్, రాయికల్ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో బీ-ఫారాల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీ యువజన శాఖ పట్టణ అధ్యక్షుడు బత్తిని నాగరాజు,మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు తాటిపాముల మమత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని జేఏసీ ప్రెస్ క్లబ్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యాకల రమేష్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం ప్రజాసేవ చేస్తూ,గడపగడపకు వెళ్లి సభ్యత్వాలు నమోదు చేసిన నిజమైన కార్యకర్తలకు కాకుండా,పార్టీలో సభ్యత్వం కూడా లేని వారికి బీ-ఫారాలు కేటాయించడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు,సొంత ఖర్చులతో అహర్నిశలు పనిచేసినా వారికి అవకాశం ఇవ్వకపోవడం పార్టీ విధివిధానాలకు విరుద్ధమని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఇది ఘోరమైన మోసమని అన్నారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్‌కు చెందిన లీడర్లకు బీ-ఫారాలు కేటాయించారని ఆరోపణలు చేశారు. జిల్లాలోని ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరుగుతున్న వర్గపోరాటాల కారణంగా స్థానికంగా పనిచేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.తనకు 2వ వార్డులో బీ-ఫారం కేటాయించినప్పటికీ, కార్యకర్తల ఆవేదన,కన్నీళ్లను చూసి తాను పోటీలో నిలబడనని ప్రకటించారు. అనంతరం పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు మాట్లాడుతూ..గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తమలాంటి వారికి కాకుండా,కాంగ్రెస్ కండువా కూడా లేని వ్యక్తులకు టికెట్లు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.తాను 9వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమైనప్పటికీ బీ-ఫారం ఇవ్వకపోవడంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు తాటిపాముల మమత మాట్లాడుతూ…పార్టీ కోసం పనిచేసే మహిళా కార్యకర్తలకు గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.తనకు 5వ వార్డులో బీ-ఫారం కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పూర్తిగా పోయిందని, ఈ ప్రభుత్వాన్ని తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *