–
సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 3, మణుగూరు/ భద్రాద్రికొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న : మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో దోమల ఉధృతిని నివారించేందుకు అన్ని వార్డులలో ఫాగింగ్ మందు పిచికారీ చేయాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని అనేక వార్డులలో మురుగు కాలువలు సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల, ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు పెరిగి దోమలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వంటి ప్రమాదకర మైన సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. అందువల్ల వెంటనే అన్ని వార్డులలో కాలువలు శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లి, రాత్రి వేళల్లో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, సమస్యపై సానుకూలంగా స్పందించి, త్వరలోనే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు కర్నే రవి తెలిపారు.