‘డోర్ లాక్’ ముసుగులో దోపిడీ: రెండు బల్బుల ఇంటికే వేల బిల్లులు – విద్యుత్ శాఖ అవినీతిపై ప్రజాగ్రహం

సాక్షి డిజిటల్ న్యూస్ : ఫిబ్రవరి 4 (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో విద్యుత్ శాఖ అధికారులు ‘డోర్ లాక్’ అనే సాకుతో సామాన్య ప్రజలపై చేస్తున్న దోపిడీ ఇప్పుడు చట్ట విరుద్ధ స్థాయికి చేరింది. ఇంట్లో కేవలం రెండు మూడు బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్న ఇళ్లకే వేల రూపాయల బిల్లులు రావడమే కాదు, మీటర్ రీడింగ్‌లోనే వేలల్లో యూనిట్లు నమోదు కావడం తీవ్ర అనుమానాలకు దారి తీస్తోంది. ఇది సాంకేతిక లోపమని అధికారులు చెబుతున్నా, చట్టపరంగా ఇది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనగా స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్ సరఫరా నిబంధనల ప్రకారం, మీటర్ రీడింగ్ తీసుకోలేని పరిస్థితిలో అధికారులు గత వినియోగ సగటు ఆధారంగా మాత్రమే అంచనా బిల్ వేయాలి. కానీ వాస్తవంగా జరుగుతున్నది వేరే. డోర్ లాక్ అంటూ రీడింగ్ తీసుకోకుండా, వినియోగానికి ఏమాత్రం సంబంధం లేకుండా యూనిట్లు పెంచి, ఆ పెరిగిన అంచనాలనే తర్వాత మీటర్ రీడింగ్‌లుగా నమోదు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, రికార్డుల తారుమారు (Manipulation of Records) కిందకు వచ్చే తీవ్రమైన నేరం. చట్టపరంగా చూస్తే, ఈ చర్యలు విద్యుత్ చట్టం, 2003కు విరుద్ధం. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం, సరైన రీడింగ్ లేకుండా అధిక బిల్లులు విధించడం, వినియోగదారుడికి వివరణ ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడడం చట్టవిరుద్ధం. అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019 ప్రకారం ఇది స్పష్టమైన “డిఫిషియెన్సీ ఇన్ సర్వీస్” గా పరిగణించబడుతుంది. వినియోగదారుడికి నష్టం కలిగించే విధంగా సేవలు అందిస్తే, బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు చట్టం ఇస్తోంది. ఇంకా తీవ్రమైన విషయం ఏమిటంటే, తప్పు రీడింగ్స్‌పై ప్రశ్నించిన వినియోగదారులను “ముందు బిల్ కట్టండి, లేకపోతే కనెక్షన్ కట్ చేస్తాం” అంటూ బెదిరించడం. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా సరఫరా నిలిపివేయడమే కాకుండా, సహజ న్యాయ సూత్రాలకు (Principles of Natural Justice) పూర్తిగా విరుద్ధం. ఫిర్యాదు పరిష్కారం కాకముందే కనెక్షన్ కట్ చేయడం ద్వారా ప్రజల జీవన హక్కును హరించడమేనని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
మీటర్ రీడింగ్ వేలల్లో చూపించబడుతున్న సందర్భాల్లో, నిబంధనల ప్రకారం వెంటనే మీటర్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరీక్ష చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియను పాటించడం లేదు. మీటర్ ఫాల్టీ అని నోటి మాటతో చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోవడం చట్టపరంగా చెల్లదు. ఒకవేళ అధికారులే తప్పుడు ఎంట్రీలు చేస్తే, అది క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ మరియు అధికార దుర్వినియోగం కిందకు వస్తుందన్న వాదన వినిపిస్తోంది.
ఒకే కాలనీ, ఒకే వీధిలో అనేక ఇళ్లకు ఇదే తరహా వేల రీడింగ్స్, వేల బిల్లులు రావడం చూస్తే, ఇది వ్యక్తిగత లోపం కాదని స్పష్టమవుతోంది. కొందరు ‘మాట్లాడితే’ బిల్లులు తగ్గిన ఘటనలు వెలుగులోకి రావడం, ఈ వ్యవహారంలో అవినీతి కోణం ఉందన్న అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇది విజిలెన్స్ విచారణకు అర్హమైన అంశమని న్యాయవర్గాలు చెబుతున్నాయి. మీటర్ రీడింగ్ తప్పులపై ప్రశ్నించే వినియోగదారులను న్యాయబద్ధంగా సమాధానం ఇవ్వకుండా, “మీటర్ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపిస్తే అక్కడ కూడా ఇదే రీడింగ్ వస్తే మీ పరిస్థితి మరింత చెడిపోతుంది” అంటూ విద్యుత్ శాఖ అధికారులు భయపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది చట్టపరమైన హెచ్చరిక కాదని, ఫిర్యాదులు చేయకుండా వినియోగదారులను వెనక్కి నెట్టే మానసిక ఒత్తిడిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీటర్ పరీక్ష వినియోగదారుడి హక్కు కాగా, అదే ప్రక్రియను భయపు ఆయుధంగా మార్చడం అధికార దుర్వినియోగానికి స్పష్టమైన నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రజల హక్కుల పరిరక్షణపై పెద్ద పెద్ద మాటలు చెప్పుతున్నా, క్షేత్రస్థాయి లో మాత్రం విద్యుత్ శాఖ అధికారులు చట్టాలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, డోర్ లాక్ పేరిట వేసిన అంచనా బిల్లులు, వేలల్లో చూపిస్తున్న మీటర్ రీడింగ్స్‌పై స్వతంత్ర విచారణ జరపాలి. బాధితులకు బిల్లుల సవరణ, పరిహారం ఇవ్వడమే కాకుండా, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.లేకపోతే, ఇది కేవలం విద్యుత్ సమస్యగా కాకుండా, ప్రజాస్వామ్యం లో ప్రభుత్వ శాఖలపై నమ్మకాన్ని దెబ్బతీసే పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *