జాతీయ జనగణనలో ఓబీసీ కాలం తొలగింపు పై భగ్గుమన్న బీసీ సంఘాలు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ నాగర్ కర్నూల్: జిల్లా జాతీయ జనగణనలో ఓబీసీ కుల గణనకు ప్రత్యేక కాలం చేర్చకపోవడంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 1 నుంచి జరగనున్న జాతి జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ పత్రాలను చించి తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు దన్నోజు అరవింద్ చారి, డాక్టర్ కాళ్ళ నిరంజన్, స్థానిక బీసీ నాయకులు పాల్గొని మాట్లాడారు. 1931లో జరిగిన కుల గణన తర్వాత మళ్లీ ఇప్పటివరకు సమగ్ర కుల గణన జరగలేదని గుర్తు చేశారు. గతేడాది ఏప్రిల్ 30న ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో జనగణనతో పాటు బీసీల కుల గణన చేపడతామని పార్లమెంట్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే జనవరి 22న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 33 ప్రశ్నల గెజిట్‌లో 12వ ప్రశ్నలో ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీనా? అనే ప్రశ్న మాత్రమే ఉంచి, ఓబీసీకి ప్రత్యేక కాలం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 70 కోట్ల మంది ఓబీసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ అనే పదమే గెజిట్‌లో లేకపోవడాన్ని నిరసిస్తూ గెజిట్ పత్రాలను చించి కాల్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుల గణనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో బీసీ ఓట్లతో గెలిచిన దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వంలోని 27 మంది ఓబీసీ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ ఎంపీలు, మంత్రులు స్పందించి గెజిట్‌లో ఓబీసీ కాలం పొందుపరిచేలా చర్చలు జరపాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుంభం మల్లేష్ గౌడ్, సత్యశీలా సాగర్, రవీందర్ గౌడ్, శివశంకర్ యాదవ్, కాశన్న యాదవ్, మహిళా అధ్యక్షురాలు రేణుక, నాయకులు శ్రీనివాస్, ఆవుల శ్రీను, సదుర్ల తిరుపతయ్య, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు