(సాక్షి డిజిటల్ రిపోర్టర్ ముత్యాల విగ్నేష్ ఫిబ్రవరి 3) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిధిలోని ఉప్పర్‌పల్లి, గువ్వలేగి, గోవిందాపూర్, పోసాన్‌పల్లి, కోనాయిపల్లి, దీపాయంపల్లి, గొడుగుపల్లి, మల్లేశం పల్లి పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఫౌండేషనల్ లిటరసీ స్టడీ (ఎఫ్ ఎల్ ఎస్) జాతీయస్థాయి సర్వేలో భాగంగా 3వ తరగతి విద్యార్థులను పరీక్షలకు ఏ విధంగా సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. నల్లబల్లపై విద్యార్థులతో ఆంగ్లం, గణితం పాఠాలు చదివించి గణిత సమస్యలను చేయించి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, మాదిరి పరీక్షలు నిర్వహిస్తూ జాతీయస్థాయి సర్వేకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే పాఠశాల ఆవరణ పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.