సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.29: వేములవాడ. టౌన్ రిపోర్టర్: అక్కనపల్లి పరుశురాం… మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. వీరప్రసాద్ తెలిపారు. ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో పత్రికా ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రం ఉన్నందున దాని చుట్టూ 100 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (పాత 144 సెక్షన్) అమలులో ఉంటుందని, ప్రజలు గుమిగూడకూడదని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు ప్రతిపాదకులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కేంద్రం పరిసరాల్లో నినాదాలు చేయడం, లౌడ్ స్పీకర్లు వాడటం, బ్యానర్లు కట్టడం వంటివి నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు లేదా బహిరంగ సభలు నిర్వహించాలన్నా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని సీఐ పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వెంట ఆధార్ లేదా ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాలు ఉంచుకోవాలని సూచించారు. నామినేషన్ల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని, చెక్కపల్లి చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు 'వన్ వే' (ఏకముఖ మార్గం) ఉంటుందని తెలిపారు. వాహనదారులు, దుకాణదారులు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మద్యం పంపిణీ, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.