రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి: 29, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్, జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం బాన్సూవాడ పట్టణంలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ తమ పాఠశాలల నుంచి ర్యాలీగా బయలుదేరి రహదారి భద్రతకు సంబంధించిన నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు శ్రీ ఉదయ్ కుమార్, మధు మాట్లాడుతూ రహదారి భద్రత ప్రాముఖ్యతను వివరించారు. రవాణా అధికారి కె. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం తో పాటు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించినప్పుడే ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో న్యూటన్ స్కూల్‌లో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిన్న వయసులోనే విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన ప్రదర్శించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రవాణా శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *