సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి :29, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను సాధారణ పరిశీలకులు డి. ప్రశాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వివరాలను పరిశీలించారు. మొదటి నామినేషన్ కేంద్రం రెవెన్యూ సెక్షన్‌లో ఏర్పాటు చేయగా,అక్కడ 1 నుండి 15 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.రెండవ నామినేషన్ కేంద్రం కౌన్సిల్ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేయగా,అక్కడ 16 నుండి 45 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.మూడవ నామినేషన్ కేంద్రాన్ని అకౌంట్స్ సెక్షన్‌లో ఏర్పాటు చేసి,అక్కడ 46 నుండి 49 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.అలాగే అన్ని నామినేషన్ కేంద్రాలలో సీసీ కెమెరాలు,డిజిటల్ వాచ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు పరిశీలకులు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థులు చెల్లించ వలసిన డిపాజిట్ మున్సిపల్ వార్డు సభ్యుడు ఎస్సీ .ఎస్టీ .బీసీ .అభ్యర్థులు 1,250, ఇతరులు 2,500. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, తహసిల్దార్ జనార్ధన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.