క్షేత్రస్థాయి పర్యవేక్షణ, పారదర్శక పాలనే లక్ష్యం: జిల్లా కలెక్టర్ “పి.రాజాబాబు”

సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 29 (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో సమగ్ర వీడియో కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ఎంపీడీవోలే తనకు “కళ్ళు, చెవులుగా” ఉండాలని, అధికారులు వారంలో కనీసం మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉగాది నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలని మరియు వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్య మరియు సామాజిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, ‘వన్ ఆఫీసర్, వన్ ఇన్‌స్టిట్యూట్’ కార్యక్రమంలో అధికారులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి బాలికల హాస్టళ్లలో వసతుల కల్పన పూర్తి చేయాలని, ఎం.ఎస్.ఎం.ఈ పార్కుల కోసం స్థలాలను త్వరగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ‘మీకోసం’ వేదిక ద్వారా వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కరించి, ప్రజల సంతృప్తిని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *