కె.కోటపాడు–దేవరాపల్లి మండలాల్లో పశు వైద్య శిబిరాల తనిఖీ

★పశు వైద్య సహాయ సంచాలకులు డా. దినేష్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి జనవరి 29: రైతులందరూ పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్య సంచాలకులు డాక్టర్ ఇ.దినేష్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా బుధవారం కే.కోటపాడు పశు వైద్య సహాయ సంచాలకులు డా. దినేష్ కుమార్ కే.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో జరుగుతున్న పశు వైద్య శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కే.కోటపాడు మండలంలోని పాతవలస, పోతనవలస గ్రామాలు, దేవరాపల్లి మండలంలోని ముసిడిపల్లి గ్రామాలలో నిర్వహించిన శిబిరాలను సందర్శించిన ఆయన, శిబిరాలలో చేపట్టిన ఏర్పాట్లు, రైతులకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. గర్భకోశ తనిఖీలు, పాడిపశువులు, లేగదూడలకు డీవార్మింగ్ మందుల పంపిణీ, గొర్రెలకు టీకాల కార్యక్రమాలు తదితర సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరాల నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే రైతులు తమ పాడిపశువులకు లింగ నిర్ధారిత వీర్యం చేయించుకునేలా అవగాహన కల్పించాలని, పశు బీమా పథకం ప్రాధాన్యతపై రైతులకు వివరించాలని డా. దినేష్ కుమార్ సిబ్బందికి ఆదేశించారు.