కబరస్తాన్లో మౌలిక వసతులను పరిశీలించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

సాక్షి డిజిటల్ న్యూస్: 29 జనవరి 2026, సత్తెనపల్లి మండల రిపోర్టర్: సిహెచ్ విజయ్, వచ్చే నెల మూడో తేదీన షబేబరాత్ (పెద్దల పండుగ) కు కబరస్తాన్ లో మౌలిక వసతులు కల్పించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. బుధవారం గుంటూరు తూర్పు నియోజక వర్గంలోని ఆనంద పేట ముస్లిం శ్మశానవాటిక ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో మంచినీటి సరఫరా. శానిటేషన్ అంశాలపై అధికారులతో మాట్లాడారు. తాగునీటి పైపులైన్ల వద్ద అపరిశుభ్రంగా ఉండటంతో వెంటనే క్లీన్ చేయించాలని, నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. శ్మశాన వాటికలో చిల్లచెట్లు పెరిగి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే.. వెంటనే వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముస్లిం మైనారిటీలు రాత్రంగా జాగారం ఉండి ప్రత్యేక దువా చేస్తారని తెలిపారు. దానధర్మాలు వంటి కార్యక్రమాలు చేపడతారని, మరణించిన తమ కుటుంబీకులు, బంధువుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటారని తెలిపారు. ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకునే సమయంగా భావిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటిక అభివ‌ృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నామని వెల్లడించారు.