ఏపీఐఐసి కోసం 84మంది నిరుపేద రైతుల పొట్ట కొట్టదండి సార్-

★జీవనాధారమైన భూములు లేకపోతే ఆత్మహత్యే గతి- ★మదనపల్లె కలెక్టర్ కు ఫిర్యాదు.

సాక్షి డిజిటల్ న్యూస్ :29 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రభుత్వం మండలంలోని రెడ్డికోట, కుక్కరాజుపల్లి పంచాయతీలలోని నాలుగు గ్రామాలకు చెందిన 84 మంది నిరుపేద ఎస్సీ, బిసి రైతుల46.527 ఎకరాల భూములను ఏపీఐఐసీ కి ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై రెండు పంచాయితీల్లో ని దళితవాడ, ఈర్లవాండ్ల పల్లి, పర్ల గొల్లపల్లి, రెడ్డికోటకు చెందిన నిరుపేద రైతులు గత నాలుగు మాసాలుగా జిల్లాకలెక్టర్, సబ్ కలెక్టర్, తాశీల్దార్లకు ఫిర్యాదులు చేశారు. గతవారం తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రైతులతో సమావేశమై రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. రైతులు జీవనాధారమైన భూములు ఇచ్చేది లేదని గట్టిగా తమ వాదనలు వినిపించారు. అయినా రెవెన్యూ అధికారులు చాప కింద నీరులా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పెద్దల సంపాదించిన భూములు పోతే మాకు ఆత్మహత్య శరణమని జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వపు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏపీఐఐసీకి భూముల సర్వే ఓవర్గం నాయకుల సలహాతో రెవెన్యూ అధికారులు మా భూములు ల్యాండ్ యాక్యువేషన్ చట్టం ద్వారా లాక్కోవాలని చూస్తున్నారని, రెవెన్యూ అధికారులు భూ కేటాయింపు విషయమై సంబంధిత రైతులకు 26-1-2026 తేదీన పేపర్ యాడ్ వేశారు తప్ప భూసేకరణ చట్టం ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వ కుండా గ్రామస్థాయిలో రైతులతో విచారణ చేయకుండా భూసేకరణ పేరుతో భూములు లాక్కుంటే మేము ఎలా బతకాలని నిలదీస్తున్నారు. మా పూర్వీకుల నుండి మా భూములలో మామిడి, టెంకాయ చెట్లతో పాటు పశుగ్రాసం, వ్యవసాయ పంటలు పండించుకొని జీవిస్తున్నామని ఆ భూములు లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణమని హెచ్చరిస్తున్నారు. టిడిపికి అండగా నిలబడితే మా భూములే లాక్కుంటారా! టిడిపి ఆవిర్భావం నుండి ఈ నాలుగు గ్రామాల బిసి, ఎస్సీ నిరుపేద రైతులు పార్టీకి అండగా నిలబడి ఓట్లు వేసి గెలిపించినందుకు మా భూములే లాక్కుంటారా అని నిరుపేద రైతులు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. మా భూములు ఏపీఐఐసీకి అప్పగించాలని చూస్తే మా 84 కుటుంబాలు జీవనాధారం లేక రోడ్డున పడతాయని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాలాంటి నిరుపేద రైతుల భూముల లాక్కోవడం సమంజసం కాదని వెంటనే మా భూములను ఏపీఐఐసీకి అప్పగించే తంతును ఆపాలని లేదంటే నడిరోడ్డుపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని రైతులు డిమాండ్ చేస్తున్నారు.