ఏంఎల్ఏ చొరవతో జాతరకు మార్గం సుగమం

సాక్షి డిజిటల్ న్యూస్, 29 జనవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్ : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్–కొదురుపాక గ్రామాల నుండి సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే ప్రధాన రహదారిని కోటి రూపాయలతో పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు చొరవతో నిర్మించారు. రోడ్డు నిర్మాణ పనులు ఏంఎల్ఏ విజయరమణరావు త్వరిత గతిన పూర్తి చేయించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. కమాన్ నుంచి జాతర ప్రాంగణం వరకు ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు మండల రమేష్ మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా ఈ రహదారి పూర్తిగా దెబ్బతిని ఉండటంతో సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా జాతర సమయంలో వేలాదిమంది భక్తులు రాకపోకలు సాగించాల్సి వచ్చేదని, రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాలు సైతం చోటుచేసుకున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సాధించారు. కోటి రూపాయల నిధులు మంజూరు చేయించి, వేగవంతంగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయించారని ఆయన ప్రశంసించారు. ఈ రహదారి నిర్మాణంతో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం లభించడమే కాకుండా, నారాయణపూర్, కొదురుపాక గ్రామాల అభివృద్ధికి కూడా గణనీయమైన ప్రోత్సాహం లభించిందన్నారు. రోడ్డు పూర్తికావడంతో ఇకపై సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అవరోధాలు లేకుండా సులభంగా చేరుకోగలరని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అంతేకాక గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు, స్థానిక రైతులు, వ్యాపారులకు కూడా ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు నాయకత్వంలో రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *