
సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ జనవరి 29/01/2026 వెల్గటూర్ మండలం. హైదరాబాద్,
పటాన్చెరువు మండలం ఖర్ధనూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ భవన నిర్మాణ పనులు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, TGIIC చైర్పర్సన్ నిర్మల, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పటా న్చెరువు ఇండస్ట్రియల్ ఏరియాతో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని తెలిపారు. గతంలో ఇక్కడ తన కంపెనీ ఉండేదని, అప్పట్లో భూమి సమస్యలు, ల్యాండ్ కేసుల కారణంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ల్యాండ్ తగాదాలు లేకుంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి వ్యవస్థ వల్ల అనేక అక్రమాలు జరిగాయని, ఎక్సట్రా రిజిస్ట్రేషన్లు, దందాలు పెరిగాయని విమర్శించారు. భూమి కొనుగోలు, అమ్మకాలు చేసే సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలనే లక్ష్యంతోనే ‘భూభారతి’ వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు. దీని ద్వారా భూములకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. ప్రజలకు సులభమైన, పారదర్శకమైన భూ పరిపాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.