సమ్మక్క చెంతకు పయనం..మేడారానికి కదిలిన పగిడిద్దరాజు!

★సాంప్రదాయ పూజలు నిర్వహించి సాగనంపిన మంత్రి సీతక్క.

సాక్షి డిజిటల్ న్యూస్(కొండూరిప్రకాష్)గంగారం జనవరి28:-ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరలో తొలి ఘట్టం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వనదేవత సమ్మక్క భర్త పగిడిద్దరాజును మేడారం గద్దెలకు చేర్చేందుకు పూనుగొండ్ల గ్రామంలో పెనక వంశీయులు సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేసి, పగిడిద్దరాజును వరుడిగా ముస్తాబు చేసే ప్రక్రియలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని మేడారానికి సాగనంపారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య భక్తుల జయజయ ధ్వానాలతో పగిడిద్దరాజు ప్రయాణం మొదలవగా, సుమారు 80 కిలోమీటర్ల మేర అటవీ మార్గం గుండా కాలినడకన సాగే ఈ యాత్ర రేపు సాయంత్రానికి మేడారం గద్దెలకు చేరుకోనుంది. గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లారబోస్తూ భక్తితో వీడ్కోలు పలుకగా, పగిడిద్దరాజు గద్దెనెక్కిన వెంటనే అధికారికంగా మహాజాతర జోరు మొదలై, అనంతరం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చే ఘట్టం ప్రారంభం కానుంది.