రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలి

★షాపులో దొరకని యూరియా యాపులో దొరుకుతుందా.? ★ ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇవ్వాలి ★ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

.

సాక్షి డిజిటల్ న్యూస్, 28 జనవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాసంగి సీజన్ ప్రారంభమైనా రైతు భరోసా అందకపోవడంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రైతు భరోసా అందించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి అన్నారు. సిరిపురం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యి మాట్లాడుతూ యాసంగి సీజన్ ప్రారంభమయ్యి వరినాట్లు ముగిసి 10రోజులు గడిచింది, కూలీల ఖర్చు,ట్రాక్టర్ దున్నకం,ఎరువులు మొదలగుఖర్చుల పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక ప్రయివేటు వ్యక్తుల వద్ద వడ్డీకి అప్పులు తెచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.సంక్రాంతికి వేస్తామన్న ప్రభుత్వం పండగ పోయి కూడా పది రోజులు గడిచిందన్నారు. వెంటనే రైతు భరోసా విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం సన్నరకాలకు బోనస్ ప్రకటించి అమలు చేయడంలేదన్నారు. దాన్యం కొనుగోలు చేసి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటికి రైతులకు బోనస్ అందడం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని రాష్ట్రప్రభుత్వ తీరు మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందిన్నారు.రైతులకు అందించే యూరియా యాప్ లో తీసుకోవాలనే నూతన నిబంధన పెట్టడంతో రైతులకు సాంకేతికతపై అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడతారని, ఇతర మండలాలకు వెళ్లి తెచ్చుకోవాలంటే ఆర్ధిక భారం మోయాల్సివస్తుందని అన్నారు.ఇప్పటికే యూరియా బయటే దొరకక రైతులు అవస్థలు పడుతుంటే కొత్త నిబంధన సరికాదని అన్నారు. షాపులో దొరకని యూరియా యాపులో ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు.రైతుల పంట సమస్యలపై, చీడ,పీడలు, సస్యరక్షణ, ఎరువు మందుల వినియోగంపై వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి రైతులకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు బల్గురి అంజయ్య,శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, రైతు సంఘం మాజీ మండల అధ్యక్షుడు అంబటి సురేందర్ రెడ్డి, కూనూరు వెంకటేశం, దాడి మల్లారెడ్డి, దాడి శుభాష్ రెడ్డి, బల్గురి ఉపేందర్, కూనూరు మల్లేశం, కందుల మధుసూదన్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.