తాటిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి

సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 28 జనవరి 2026 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
మండలం సుద్దాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సుద్దాల గ్రామానికి చెందిన గీత కార్మికుడు యమగాని బక్కయ్య మంగళవారం జీవనోపాధి కోసం తాటిచెట్టుపైకి ఎక్కి కళ్లు తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే 108 అత్యవసర వైద్య సేవల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బక్కయ్యను జనగామ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించి దురదృష్టవశాత్తు మృతి చెందినట్లు సమాచారం.బక్కయ్య మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ఎస్సై తేజం రెడ్డి తన సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.రోజువారీ కష్టపడి పనిచేసే గీత కార్మికుడి 7అకాల మరణం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. మృతుడి కుటుంబా నికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గ్రామస్తులు, గీత కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.