కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత ఇచ్చింది గోరంత

★పార్లమెంటు సభ్యులారా పోరాడండి - సాధించండి. ★డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ 27-1-2026, వేంపల్లి. ( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు ) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత కాగా ఈ 11 సంవత్సరాలలో ఇచ్చింది గోరంత మాత్రమే అని రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూఈ పార్లమెంటు సమావేశాలలో నైనా రాష్ట్రానికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమస్యలపై పార్లమెంటులో గళమెత్తి పోరాడి వాటిని సాధించాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాను అమలు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేసింది. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తీర్మానం కూడా చేసింది. దురదృష్టవశత్తు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు దాటిన ఇంతవరకు అమలు చేయలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిది. కేంద్ర పన్నుల్లో రాయితీలు లభిస్తాయి.. దీనివలన పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు.తద్వారా నిరుద్యోగ సమస్య నిర్మూలనమవుతుంది.కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం నుండి 90 శాతానికి పెరుగుతుంది.విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నూరు శాతం నిధులు భరిస్తుంది.ప్రత్యేక హోదా అమలై ఉంటే ఈపాటికి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయి ఉండేది.2047 వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. కనీసం ఈ పార్లమెంటు సమావేశాలలోనైనా ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటు సభ్యులు పోరాడి సాధించాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ గానీ,ఒరిస్సా లోని కె బి కె తరహా ప్యాకేజీ గానీ అమలు చేయాలి.11 ఏళ్లు పూర్తయినా మోడీ ప్రభుత్వం అమలు చేయకపోవడం శోచనీయం.ఈ పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటు సభ్యులు ఈ ప్యాకేజీ కోసం పోరాడి సాధించాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి,దుగరాజపట్నం వద్ద మేజర్ ఓడ రేవు నిర్మించాలి,రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి,పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును కేంద్ర నిధులతో సత్వరం పూర్తి చేయాలి,విశాఖ మెట్రో,విజయవాడ మెట్రో రైలు మార్గాలను నిర్మించాలి,తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలి,కాకినాడ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ,విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పాలి. ఇవే మీ అమలు కాలేదు. ఐఐటి, ఎన్ ఐటి లాంటి 13 కేంద్రీయ సంస్థలను నవ్యాంధ్రలో ఏర్పాటు చేయాల్సి ఉండగా అవన్నీ నత్త నడకన సాగుతున్నాయి.విభజన చట్టంలో 9,10 షెడ్యూల్ల కింద ఉన్న సంస్థలు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ రాలేదు. ఈ సమస్యలన్నిటిమీద రాష్ట్రానికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు నిర్మాణాత్మక వైఖరితో పటిష్టమైన వాదనలు వినిపించి సాధించాలని తులసి రెడ్డి కోరారు.
బాబు గారూ!స్వర్ణాంధ్ర దేవుడెరుగు. మద్యాంధ్ర,అప్పుల ఆంధ్ర 2047కు ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పడం హాస్యాస్పదం,విడ్డూరం. ప్రజలు కూటమి పార్టీలకు అధికారం ఇచ్చింది కేవలం ఐదు సంవత్సరాలకే, అంటే 2029 వరకే. ఆ లోపల చేసేది చెప్పాలి కానీ 2047 కు స్వర్ణంధ్ర చేస్తామని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పుడు ఉన్న వారిలో ఎవరు కూడా అప్పటికి జీవించి ఉండరు.రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. మండలానికి నాలుగు మద్యం షాపులు,40 బెల్ట్ షాపులు అన్న విధంగా తయారయింది.మద్యం మత్తులో అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. మూడు జోకర్లు ఆరు కళావరులుగా జూదం విస్తరించింది.సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో జూదం వెర్రి తలలు వేసింది.12 -13 సంవత్సరాల పిల్లలు గంజాయికి, డ్రగ్స్ కు అలవాటు పడిపోతున్నారు. స్వర్ణాంధ్ర దేవుడెరుగు.రాష్ట్రం మధ్యాంధ్రగా, జూదాంధ్రగా, డ్రగ్ఆంధ్రగా మారకుంటే చాలు, అదే పది వేలు అని ప్రజలు అనుకుంటున్నారు. కూటమి పాలనలో రాష్ట్రంఅప్పుల కుప్పయింది.కేవలం 18 నెలల కాలంలో 2,66,175 కోట్ల రూపాయల అప్పుచేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది.అప్పుల్లో కూటమి ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు.స్వర్ణాంధ్ర దేవుడెరుగు. అప్పుల ఆంధ్ర చేయకుంటే అదే చాలని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకొని నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని తులసి రెడ్డి కూటమి ప్రభుత్వానికి సూచించారు. సూపర్ సిక్స్ హామీలలో ఇంకా అమలుకు నోచుకోని నిరుద్యోగ భృతి,ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం ఈ హామీలను వెంటనే అమలు చేయాలని తులసి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రసాద్ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి,వేంపల్లి మండల శాఖ అధ్యక్షులు బీగాల రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి,ఉత్తర్న, తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బండారు వెంకటేశు, చిన్నకోట్ల నాగరాజు, నా మా వినయ్ తదితరులు పాల్గొన్నారు.