సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28 (శేరిలింగంపల్లి): ఓసి జేఏసీ ఈడబ్ల్యూఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్ రావు నియమితులయ్యారు. మదినగూడలోని ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓసి జేఏసీ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రకులాల్లోని నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా ఓసి జేఏసీ పని చేస్తోందని తెలిపారు. వరంగల్ సింహగర్జనను విజయవంతం చేసిన ఓసిలకు కృతజ్ఞతలు తెలిపారు. వినోద్ రావు మాట్లాడుతూ 1986 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీ, సేవాదళ్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉందన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటానని, శేరిలింగంపల్లిలోని ఓసి కులాల్లోని నిరుపేదల హక్కుల కోసం కృషి చేస్తానన్నారు. ఓసీల్లో 90 శాతం మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, రిజర్వేషన్ల వల్ల నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఓసి జేఏసీ మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శులు కొడాలి శ్రీధర్, శేరి అంతిరెడ్డి, విద్యాసాగర్, సభ్యులు దండమూరి ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.