సాక్షి డిజిటల్ న్యూస్, అనంతపురం, జనవరి 26 : అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ముంగా ప్రదీప్ రాజ్యాంగం కల్పించిన హక్కులను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజాప్రతి నిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగం సమాన హక్కులు, సమాన అవకాశాలను అందరికీ కల్పించిందని చెప్పారు. ఈ రోజు దేశమంతా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు అవుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై గాంధీజీ చూపిన మార్గంలో వైఎస్ జగన్ నాయకత్వంలో తమ పార్టీ ముందుకు వెళ్తోందని చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను గౌరవిస్తూ దేశానికే తల మానికంగా 206 అడుగుల ఎత్తుతో విజయవాడలో మహనీయుడైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. బీఆర్ అంబేడ్కర్ సిద్దాంతాలు, ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.