లింగంపల్లి గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

*రాజ్యాంగ విలువల సందేశంతో లింగంపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 27:నవాబుపేట మండలం, లింగంపల్లి గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభ సందర్భంగా 77వ గణతంత్ర దినోత్సవాన్ని లింగంపల్లి గ్రామంలో ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై దేశభక్తి భావాలను ప్రదర్శించారు. ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ వడ్ల శోభ పరమేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. పంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ముగించిన అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మరోసారి జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించడం, ప్రసంగాలు చేయడం ద్వారా గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించగా ఈ సందర్భంగా సర్పంచ్ శోభ పరమేశ్వర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకునే రోజు అని, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే సూత్రాలే మన దేశానికి పునాది అని పేర్కొంటూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. అనంతరం ఉపసర్పంచ్ ప్రవీణ కుమార్ మాట్లాడుతూ విద్యే సమాజాభివృద్ధికి మూలమని, గ్రామంలోని ప్రతి విద్యార్థికి పంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమం అనంతరం పాఠశాల విద్యార్థినీ–విద్యార్థులకు బహుమతులు, నోట్‌బుక్స్, పెన్నులు, వంటి విద్యా సామగ్రిని సర్పంచ్ మరియు ఉపసర్పంచ్‌ల చేతుల మీదుగా పంపిణీ చేయగా ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకల్లో వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా ప్రజలందరినీ భాగస్వాములుగా మార్చి, విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడేలా నిర్వహించడం లింగంపల్లి గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *