సాక్షి డిజిటల్ న్యూస్ వర్ధన్నపేట. . రిపోర్టర్ . కుందూరు మహేందర్ రెడ్డి వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మైనార్టీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్ పిలుపునిచ్చారు. ఆదివారం 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి పై విద్యార్థులు ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి,మై ఓట్ మై ఇండియా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్లకార్డులు ప్రజలను ఆలోచింపజేశాయి. అంబేద్కర్ సెంటర్లో విద్యార్థులు, అధికారులు, ప్రజలు పాల్గొని మానవహారం నిర్వహించారు. తహసీల్దార్ విజయసాగర్ అందరితో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కుల, మత, వర్గ, భాషా భేదాలకు తావులేకుండా, ఎటువంటి ఆశలకు, ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఎన్నికలో భయం లేకుండా ఓటు వేస్తామని ఈ సందర్భంగా అందరూ ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్, ఎస్.ఐ సాయిబాబు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, యువత దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, బి.ఎల్.ఓలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.