భారీ వృక్షాల నరికివేతపై స్థానికుల ఆగ్రహం

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి జనవరి 26. కే కోటపాడు మండలంలో కే కోటపాడు నుండి పెందుర్తి వెళ్లే మార్గంలో రోడ్ల ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను ఎలక్ట్రికల్ సిబ్బంది విచక్షణా రహితంగా నరికివేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ లైన్లకు అడ్డు ఉన్నాయనే కారణంతోనే కాకుండా, అడ్డు లేని చెట్లను కూడా నరికివేసి వాటి మొదళ్లను అమ్ముకుంటు న్నారని ఆరోపిస్తున్నారు. వచ్చేది వేసవికాలం కావడంతో రోడ్ల పక్కన ఉన్న చెట్ల నీడ వాహనదారులకు, ప్రయాణికులకు ఎంతో ఉపశమనం ఇస్తుందని, అలాంటి చెట్లను నరికివేయడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కొమ్మలు మాత్రమే తొలగించాల్సిన చోట, పూర్తిగా మొదటికి నరికివేసి కలపను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై సంబంధిత అధికారులు, అటవీ శాఖ స్పందించి రోడ్ల ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెట్లు లేని ప్రాంతాల్లో మాత్రమే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.