బదినేహళ్ గ్రామంలో వలస బాట

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 కర్నూలు జిల్లా కౌతళం మండలం, కౌతాళం మండలంలోని బదినేహాల గ్రామం అంటేనే చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు ఉపాధి అవకాశాలు కల్పించే గ్రామం. ఈ గ్రామంలో నల్ల రేగడి భూములు సారవంతమైనవి కావడంతో మిరప, పత్తి పంటలు బాగా పండిస్తారు. ఇలాంటి గ్రామంలో వ్యవసాయ కూలీలకు రోజూ పనులు ఉండేవి. ఈ గ్రామంలో ఉండే వారికే కాకుండా కౌతాళం, ఎరిగేరి, కుప్పగల్, బల్లేకల్, పాండవగల్లు, పెద్దతుంబలం గ్రామాల నుంచి వ్యవసాయ కూలీలు వచ్చి కూలి పనులు చేసేవారు. ఇలాంటి గ్రామం నుంచి వలసలు పోతున్నారంటే అందరికీ ఆశ్చర్యం కలిగే విషయం..! బదినేహాల్ గ్రామం నుంచి బొలెరో వాహనాల్లో 150 కుటుంబాలు గుంటూరుకు వలస వెళ్లాయి. రోజూ మండలం నుంచి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. తుంగభద్ర కాలువకు రబీ పంటకు సాగునీరు లేకపోవడంతో, వ్యవసాయ కూలీలకు పనులు లేకపోవడంతో వలస బాట పడుతున్నారు. అధికారులు కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికైనా ప్రతి గ్రామంలోనూ ఉపాధి పనులు కల్పించి వలసలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.