గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు”

★నూతన మార్కాపురం జిల్లాలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను, పోలీసు పరేడ్ రిహార్సల్స్ ను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ "వి.హర్షవర్ధన్ రాజు" ఐపీఎస్.

సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 26, (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
నూతన జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో 26వ తేదీన జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మార్కాపురంలోని ఎస్వికేపి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న పెరేడ్ ప్రాంగణాన్ని మరియు భద్రత ఏర్పాటులను జిల్లా ఎస్పీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరేడ్ ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, అధికారుల కూర్చునే ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. తొలిసారిగా జిల్లా స్థాయిలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలు కావడంతో, వాటిని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ వేడుకలకు అతిథులు, ప్రముఖులు, విద్యార్థులు హాజరు కానున్నందున అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచలను తెలియ చేసారు. నూతన జిల్లాగా అవతరించిన మార్కాపురంలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం గర్వకారణమని, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ తెలిపారు.
అనంతరం జనవరి 26న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ బలగాలు, హోమ్ గార్డ్ మరియు NCC విభాగాలు నుండి 5 ప్లాటూన్ లు మరియు ఎఆర్ ఎస్సై సురేష్ పెరేడ్ కమాండర్ గా నిర్వహించిన కవాత్ రిహార్సల్ ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. రిహార్సల్స్ లో భాగంగా ముందుగా గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగుర వేశారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీసు బలగాల పరేడ్ ను కూడా పరిశీలించి కవాత్ ను నిర్వహించడంలో కొన్ని సూచనలు, మెళుకువలు సూచించారు. వేడుకలకు హాజరయ్యే ముఖ్యఅతిధులు, ప్రజానీకానికి దేశ ఉన్నతిని చాటేలా పోలీస్ పరేడ్ సాగాలన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో రెట్టించిన ఉత్సాహంతో కవాతు ప్రదర్శన చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, మార్కాపురం సీఐ సుబ్బారావు, ఆర్ఐ సీతారామరెడ్డి, మార్కాపురం టౌన్ ఎస్ఐ సైదు బాబు, ఎస్సైలు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.