సంసద్ సభ్యుల వేతనాలు–భత్యాలపై సంయుక్త కమిటీ సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 జిల్లా మంచిర్యాల జిల్లా రిపోర్టర్ రావుల రాంమోహన్… దేశవ్యాప్తంగా సంసద్ సభ్యుల వేతనాలు, భత్యాలు, పని పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులపై రోజురోజుకు పెరుగుతున్న బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాల్సిన అవసరం వంటి కీలక అంశాలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్‌లో నిరంతరం పనిచేస్తున్న ఎంపీల దృష్ట్యా, వేతనాలు–భత్యాల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అదే సందర్భంగా, తెలంగాణలో అతిపెద్ద పండుగ, ఆసియా ఖండంలో రెండవ పెద్దదైన గిరిజన పండుగ అయిన రాబోయే సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, అలాగే రైల్వేకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు, ఇతర సమస్యలను అత్యంత సీరియస్‌గా పరిగణించి తక్షణమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వంశీకృష్ణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పెండింగ్ సమస్యల వల్ల స్థానిక ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. గ్రామీణ–పారిశ్రామిక ప్రాంతాలైన పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ఎంపీగా వంశీకృష్ణ చేసిన సూచనలు కమిటీ సభ్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన ప్రస్తావించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.