మేడివాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.1,00,116 విరాళం

★దాత టి.అర్జాపురం గ్రామం రాజాన చిన్ననాయుడు కు పలువురు అభినందనలు

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం జనవరి 25: మేడవాడ కొండపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి టి.అర్జాపురం గ్రామానికి చెందిన రాజాన చిన్నం నాయుడు రూ.1,00,116 విరాళంగా శనివారం అందించారు. అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, మేడవాడ గ్రామంలోని కొండపై కొలువుదీరిన 170 ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి గాను ఈ విశేష విరాళాన్ని ఆయన అందించారు. దాదాపు 170 సంవత్సరాల క్రితం కుంచంగి రామస్వామినాయుడు, అప్పటి మాడుగుల మహా రాజు సలహా సూచనల మేరకు కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామస్తులు మరియు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులు దశలవారీగా జరుగుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి నిమిత్తం ఎల్‌ఐసీ ఏజెంట్ అయిన రాజాన చిన్ననాయుడు ఆ దేవుని పై గల భక్తిశ్రద్ధలతో ఆ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించాలని కోరుతూ ప్రస్తుత ఆలయ ధర్మకర్త (ట్రస్టీ) కె.వి. రామనాయుడుకు అందజేశారు.
లోక కల్యాణార్థం స్వామివారి సేవలో భాగస్వాములవ్వడం తమ పూర్వజన్మ సుకృతమని, స్వామివారి కృపగా భావిస్తున్నామని దాత రాజాన చిన్ననాయుడు ఈ సందర్భంగా తెలిపారు. ఈ పురాతన ఆలయ అభివృద్ధికి దాతలు మరింత సహకారం అందించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రావాలని ఆలయ ధర్మకర్త కె.వి. రామనాయుడు తో పాటు గ్రామ ప్రజలు కోరుతున్నారు. అలాగే భారీ విరాళం అందించిన చిన్ననాయుడును పలువురు అభినందించారు. శేషు రావికమతం.