సాక్షి డిజిటల్ న్యూస్: 25 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామ సమీపంలో చెత్త తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ సమీపంలో మున్సిపల్ అధికారులు విచ్చలవిడిగా చెత్తను కుమ్మరిస్తుండటం, సాయంత్రం వేళల్లో ఆ చెత్తకు నిప్పు పెడుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని నిరసిస్తూ శనివారం గ్రామస్తులు చెత్త తరలిస్తున్న మున్సిపల్ వాహనాలను అడ్డుకొని ఆందోళనకు దిగారు. విషపూరితమైన పొగతో ఊరంతా కమ్ముకుంటోందని, దీనివల్ల చిన్న పిల్లలు, వృద్ధులు దగ్గు, శ్వాసకోస సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. దుర్వాసనతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు చెత్త తరలిస్తున్న వాహనాలను నిలిపివేశారు.