బాధ్యతాయుతమైన ఓటరుతోనే బలమైన ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

*బీఎల్ఓ రాష్ట్ర అధ్యక్షురాలు నజీమా బేగం

( సాక్షి డిజిటల్ న్యూస్ మెట్ పల్లి మండల్ జనవరి 25 షేక్ అజ్మత్ అలీ ) ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, బాధ్యతాయుతమైన ఓటరుతోనే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని బీఎల్ఓ రాష్ట్ర అధ్యక్షురాలు నజీమా బేగం పేర్కొన్నారు. ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం స్థాపించబడిన సందర్భంగా 2011 నుంచి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు.ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు, అది ప్రతి భారత పౌరుడి బాధ్యత. మనం వేసే ఒక్క ఓటు దేశ పాలన దిశను నిర్ణయిస్తుంది. ఓటు వేయకపోవడం అంటే ప్రజాస్వామ్యానికి మన వంతు బాధ్యతను విస్మరించినట్టే” అని స్పష్టం చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బి ఎల్ ఓలే లు) ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె కొనియాడారు. ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు చేయడం, అర్హులైన యువతను ఓటర్లుగా చేర్చడం, ఓటరు జాబితాలో సవరణలు చేయించడం వంటి బాధ్యతలను బి ఎల్ ఓ లు అంకితభావంతో నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. “ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ప్రజా స్వామ్యాన్ని బలపరుస్తున్న మూలస్తంభాలు బీఎల్ఓ అని అన్నారు. యువ ఓటర్లను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి. ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించు కోవడం ద్వారా మంచి పాలనకు మార్గం సుగమమవుతుంది” అని పిలుపునిచ్చారు.
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయిలో ఓటరు నమోదు శిబిరాలు, అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమాలు ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలని అన్నారు.
చివరగా నజీమా బేగం మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన ఓటరు ఉన్నప్పుడే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యం. ప్రతి ఒక్కరూ తమ ఓటు విలువను గుర్తించి, దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *