(సాక్షి డిజిటల్ న్యూస్ బి ప్రభాకర్ ప్రతినిధి, శంషాబాద్ జనవరి 25): పేదల పక్షపాతి, భూ పోరాటాల యోధుడు, సీపీఐ సీనియర్ రాష్ట్ర నాయకులు సయ్యద్ అఫ్సార్ ని శంషాబాద్ మండల పార్టీ శ్రేణులు శనివారం ఘనంగా సన్మానించాయి. మండల నాయకత్వం వారి నివాసానికి వెళ్లి, ఆయన చేసిన సుదీర్ఘ ప్రజా సేవను గుర్తుచేసుకుంటూ మర్యాదపూర్వకంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. యాదగిరి, మండల కార్యదర్శి నర్రగిరి, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు అన్నెపు ప్రభు పాల్గొన్నారు. ఆదర్శప్రాయం అఫ్సార్ మార్గదర్శకత్వం: ఈ సందర్భంగా మండల కార్యదర్శి నర్రగిరి ఉద్వేగభరితంగా మాట్లాడుతూ.. "నా రాజకీయ ప్రస్థానానికి దిక్సూచి, నా రాజకీయ గురువు సయ్యద్ అఫ్సార్ ని సన్మానించుకోవడం నా అదృష్టం" అని పేర్కొన్నారు. శంషాబాద్ ప్రాంతంలో చారి నగర్ భూ పోరాటం వంటి చారిత్రాత్మక ఉద్యమాలను ముందుండి నడిపించి, వందలాది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఘనత అఫ్సార్ కే దక్కుతుందని కొనియాడారు. ఉద్యమ బాట వీడబోం: గురువు చూపిన బాటలోనే నడుస్తూ, భవిష్యత్తులో ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు చేస్తామని నర్రగిరి స్పష్టం చేశారు. అఫ్సార్ విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీ బలోపేతానికి, పేదల హక్కుల రక్షణకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయనకు మాట ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ నేతలు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.