సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి:25, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల అనిల్ కుమార్, జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ పాఠశాలలో రహదారి భద్రత ఇతివృత్తంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ క్విజ్ పోటీలలో వివిధ విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రహదారి భద్రతకు సంబంధించిన తమ పరిజ్ఞానాన్ని పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు కె. ఉదయ్ కుమార్, శ్రవణ్ మరియు స్నిగ్ధ మాట్లాడుతూ, విద్యార్థులు రహదారి భద్రతపై ప్రదర్శించిన అవగాహన, ప్రతిభ అభినందనీయమని పేర్కొన్నారు. క్విజ్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు రోజున ఉన్నతాధికారుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిన విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యానికి జిల్లా రవాణా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.