సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, జనవరి 25 2026, పరిశుభ్రత అనేది అభివృద్ధితో సమానమని, స్వచ్ఛతే ఆరోగ్యకర సమాజానికి మూలాధారమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశం మరింత గొప్పగా నిలవాలంటే ప్రతి భారత పౌరుడూ పరిశుభ్రతను తన బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామంలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి పాల్గొన్న తంగిరాల సౌమ్య స్వచ్ఛ రథాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చెత్త ద్వారా కూడా సంపదను సృష్టించవచ్చనే అవగాహన కల్పించడానికే స్వచ్ఛ రథం లక్ష్యం అని ఆమె తెలిపారు. అనంతరం గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులతో చేయి చేయి కలిపి చీపురు పట్టి రోడ్డుపక్క చెత్తను స్వయంగా తొలగించి, పరిశుభ్రత ఉద్యమానికి నాయకత్వం వహించారు. పరిశుభ్రత మన ఇంటి నుంచే ప్రారంభమై వీధి, సమాజం, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం గుండా దేశం వరకూ విస్తరించాల్సిన ఉద్యమమని పేర్కొంటూ, పరిశుభ్రత ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది ఆరోగ్యకర సమాజమే అభివృద్ధికి బాట అని ఆమె అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత లక్ష్యాలను సాధించగలమని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.గ్రామ ప్రజలు, కూటమి నేతలు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.