దద్దరిల్లిన కోదాడ…చలో కోదాడ నిరసన ర్యాలీ విజయవంతం …

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25, 2026 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్, దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ శాంతి యుతంగా కొనసాగుతూ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మరియు రాజేశ్ తల్లి కర్ల లలితమ్మ గార్లతో కలిసి ముఖ్య అతిథులుగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ… కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్య జరిగి 60 రోజులు గడుస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. టూరిస్టులుగా మారిన ఉత్తమ్ దంపతుల పాలనలో కోదాడలో షాడో ఎమ్మెల్యేల రాజ్యం, మాఫియా పాలన నడుస్తోందని ఆరోపించారు. పోలీసులకు అడ్డు అదుపు లేకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడంతో జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం, ఆస్తి నష్టం కలిగించడం, దిమ్మెలు పగలగొట్టడం వంటి ఘటనలకు పాల్పడుతున్నా, పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప ఇప్పటివరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోదాడ పట్టణ సీఐ శివశంకర్ వ్యవహార శైలి పూర్తిగా “రౌడీకి కాకి చొక్కా తొడిగినలా ఉందని మండిపడ్డారు. ఆయన గత చరిత్ర మొత్తం అవినీతిమయమైందని, కోదాడలో కూడా ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఇక సహించేది లేదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందుముందు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కేవలం లక్ష రూపాయల చెక్కు విషయంలో కర్ల రాజేష్‌ను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, అతని హత్యకు చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి ప్రత్యక్ష కారణమై ఉన్నా, ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాజేష్ మరణంలో విచారణ నుంచి పోస్టుమార్టం వరకు మొత్తం వ్యవస్థ పారదర్శకంగా లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అనేక ఆధారాలు ప్రజల ముందు, ప్రభుత్వ ముందు ఉంచినా చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే, స్థానిక ప్రజాప్రతినిధులైన ఉత్తమ్ దంపతులు తమ అధికారాన్ని ఉపయోగించి బాధ్యులను ఎలా వెనకేసుకొస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందన్నారు.రాజేష్ మరణంతో వృద్ధాప్యంలో ఉన్న అతని తల్లి అనుభవిస్తున్న కడుపుకోతకు కారణమైన ఉత్తమ్ దంపతులు సరైన సమయంలో తగిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధికారుల ఉద్యోగాలకు భద్రత ఉంది గానీ, సామాన్య ప్రజల ప్రాణాలకు భద్రత లేదని తీవ్రంగా విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేసినా, ప్రజల మద్దతుతో వెనకడుగు వేయకుండా పోరాడుతున్నానని తెలిపారు. ఇవన్నీ ఫలించకపోవడంతో అమాయకుల ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో తాను అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పోలీసులతో ఎలాంటి మర్యాదతో, బాధ్యతాయుతంగా వ్యవహరించేవాడినో ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకు బాగా తెలుసని అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్ధరాత్రి వేళల్లో పోలీసులతో ఏ విధంగా మాట్లాడుతారో కూడా ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరులు చేసిన దాడులను పోలీస్ యంత్రాంగం పట్టించుకోకున్నా తాము కూడా ఓపికతో భరించామని, కానీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతూ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తే పరిస్థితులు చేయి దాటుతాయని అటువంటి సందర్భంలో దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *