గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి

★అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర నాయకులు, న్యాయవాది ఎర్ర రమేష్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం మన దేశం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించగా, 1950 జనవరి 26న దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకు వచ్చారు. అంతేకాకుండా, 1930లో భారత జాతీయ కాంగ్రెస్ “పూర్ణ స్వరాజ్య” ప్రకటన చేసిన జనవరి 26 తేదీకి చారిత్రక ప్రాముఖ్యత ఉన్నందున, అదే తేదీని గణతంత్ర దినోత్సవంగా ఎంపిక చేయడం జరిగింది. స్వాతంత్ర్య భారతదేశానికి నూతన రాజ్యాంగం ద్వారా దిశా నిర్దేశం చేసి, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అనే విలువలను పునాదిగా నిలిపి, ప్రపంచంలోనే అతిగొప్ప లిఖితపూర్వక రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహానీయుడు భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఎర్ర రమేష్ తెలిపారు. కావున, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించే ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలాగే రాజ్యాంగ విలువలను ప్రజలకు వివరించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, స్వేచ్ఛలను అనుభవిస్తున్న ప్రతి పౌరుడు దాని రూపకర్త అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవం తెలపడం మన అందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రం నుండి న్యాయవాది, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.