అభివృద్ధి విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

*గుంటూరు పశ్చిమలో ప్రజా సమస్యల గురించి మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

సాక్షి డిజిటల్ న్యూస్: 25 జనవరి 2026, సత్తెనపల్లి మండల రిపోర్టర్: సిహెచ్ విజయ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు, రహదారులు, కాలువలు, చెరువుల అభివృద్ధి విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని నిర్ణీత గడువుల్లో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధికారులను ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన క్యాంపు కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజా గ్రీవెన్స్‌కు వస్తున్న పలు సమస్యలను అధికారుల ముందుంచి, వాటిని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గంలో కొనసాగుతున్న మరియు ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా 25వ వార్డులో గెలాక్సీ బార్ పక్కన ఉన్న రోడ్డును వెడల్పు చేయడంలో ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి, జనవరి 30లోపు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా 25వ డివిజన్‌లోని జమీందార్ చెరువుకు కాంపౌండ్ వాల్ నిర్మించి, ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. 43వ డివిజన్‌ విద్యానగర్ 2వ లైన్‌లో పునర్నిర్మాణం ప్రక్రియ పూర్తి చేసి వెంటనే బాండ్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుగాలి కాలనీ కాలువకు శాంక్షన్ మంజూరైన నేపథ్యంలో, 20 మీటర్ల పొడవున కాలువ నిర్మాణానికి అడ్డుగా ఉన్న సమస్యలను తొలగించి వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపారు. ముత్యాల రెడ్డి నగర్ మెయిన్ రోడ్డుకు సంబంధించి సీసీ రోడ్డు, కాలువల పనులు మంజూరయ్యాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ రోడ్డును 40 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయాలని, ఈ పనులు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే విద్యానగర్ మొదటి లైన్ విస్తరణ పనులు సీతయ్య డొంక వరకు పూర్తి చేయాలని పేర్కొన్నారు. నీలంపాటి అమ్మవారి గుడి నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు కాలువల నిర్మాణానికి మంజూరు ఉన్నందున, రోడ్డు విస్తరణ కూడా చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముత్యాల రెడ్డి నగర్ వాగు నుండి అమరావతి రోడ్డు వరకు కాలువ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ ద్వారా వెంటనే మార్కింగ్ చేయించి, విస్తరణకు అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగించి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. 49వ డివిజన్ కొండయ్య కాలనిలోని రోడ్డు పనులు కూడా వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. 36వ డివిజన్‌లోని రజక చెరువు సర్వే పూర్తయ్యిందని, అక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. 20వ డివిజన్ నంబూరు సుభాని కాలనీ, పీకల వాగు కట్ట వద్ద 20 మీటర్ల రోడ్డు పనులు ఆగిపోయిన నేపథ్యంలో, సర్వే నిర్వహించి రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తీరుతాయని పేర్కొని, ఆ పనులను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే అనంత వరపాడు లేఔట్ కింద సుమారు 6,000 మంది లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వంలో స్థలాలు చూపించ కుండా రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాబట్టి వెంటనే లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు చూపించి, వారు ఇళ్ల నిర్మాణం చేసుకునేలా పూర్తి సహకారం అందించాలని అధికారులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *