రోడ్డు భద్రత అనేది సమాజం లోని ప్రతి ఒక్కరి బాధ్యత

సాక్షి డిజిటల్ న్యూస్ మెట్పల్లి మండల్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ 20-01-2026: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది కేవలం పోలీసుల పని మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యత అని మెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ఆయన ప్రత్యేక సూచనలు చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా యువత మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. ఇది ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుండి 80% కాపాడుతుంది. మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల కలిగే ప్రమాదాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అయన అన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. ​అతి వేగం వద్దు వేగం కన్నా ప్రాణం ముఖ్యం.
అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నిబంధనల ప్రకారం నిర్ణీత వేగంతోనే ప్రయాణించాలి. ​రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పి. కిరణ్ కుమార్ పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.