సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 20, రామకృష్ణాపూర్: బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే వార్డుల రిజర్వేషన్లు మార్పు చేశారా..? అంటే అవుననే సమాధానం ప్రజల నుండి ఎక్కువగా వినిపిస్తుంది. రానున్న క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలే అని తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంతగా ఫలితాలు రాలేదనే చెప్పాలి. బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికల్లో బాగానే ఫలితాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలంటే గుర్తులుండవు. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే పార్టీలుగా విడిపోయి ప్రచారం చేసుకోవడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. అయితే గ్రామాలు వేరు పట్టణాలు వేరు. పట్టణ ఓటర్లు ఒక పట్టాన అర్ధం కారు. పట్టణ ఓటర్లు ఖచ్చితంగా పార్టీ పాలనను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటారు. డెవలెప్ మెంట్ చూస్తారు. అలాగే సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మరీ ఓటేస్తారు. అందులో భాగంగానే క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి రాబోయే మున్సిపల్ ఎన్నికలు మంత్రి వివేక్ వెంకటస్వామి కి పెద్ద సవాలుగానే నిలిచాయి.గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం, ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారికే కౌన్సిలర్ టికెట్ కేటాయిస్తారా..! పైసలుంటేనే టికెట్ కేటాయిస్తారా..! అనేది వేచి చూడాల్సిందే.మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలకు కూడా పట్టు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ తప్పేట్లు కనిపించడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ వారికి మంత్రి భరోసా ఇచ్చి ప్రత్యామ్నాయ పదవులు ఇస్తారో లేదో అనేది వేచి చూడాల్సిందే. అధికార పార్టీ నేతలు అయితే టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తామని బహిరంగంగానే చెబుతుండడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతృప్త స్థాయి ప్రజలు ఉన్నారు, అసంతృప్త స్థాయి ప్రజలు కూడా అదే రేంజ్ లో ఉన్నారు.పింఛనుదారుల నుంచి నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు పట్టణ ఓటర్లుగా తమ తీర్పును చెప్పనున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, మంత్రికి, డిసిసి అధ్యక్షులకు కత్తిమీద సాము లాంటివనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల విషయంలో మంత్రులనే బాధ్యులను చేసినప్పటికీ మంత్రులు ఏ స్థాయిలో పార్టీ గెలుపునకు ఉపయోగపడతారన్నది వేచి చూడాల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికలను ప్రెస్టేజ్ గా తీసుకున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ రానున్న మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
