జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

* కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న.

సాక్షి డిజిటల్ న్యూస్: 20 జనవరి, పాల్వంచ. రిపోర్టర్ కె.జానకిరామ్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, పెద్దలు, అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు తీర్మానంలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో మహాత్మా గాంధీ పేరుతో నడుస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కోట్లాది మంది గ్రామీణ పేదల జీవనాధారాన్ని దెబ్బతీయాలని చూస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని గ్రామపంచాయతీల్లో యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలంటూ తీర్మానాలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ పిలుపులో భాగంగా టీపీసీసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఈ తీర్మానాలు చేపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఆమె కోరారు. గ్రామీణ పేదల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే ప్రయత్నాలను సహించేది లేదని తోట దేవి ప్రసన్న స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *